"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

20 మార్చి, 2013

అఫిషియల్ కాలని జ్ఞాపకాలు .. మరి కొన్ని ..2

మా ఇంటి ముందు , ఆ వీధిలో చాల మంది మెడికోస్ ,డాక్టర్లు ఉండే వారు, కే జి హెచ్ కి దగ్గర కదా ,అందుకని .. మా అమ్ముమ్మ ఇంట్లో మేడ మీద ఉన్న గదుల లో కొంత మంది మెడికోస్ ఉండి ,ఆ ఇంటికి ముచ్చట గా ' మర్కట లాడ్జ్ ' అని పిలుచుకునే వారు ట . 

మర్కటాల సంగతేమో కాని, మా విసాపట్నం లో ఒక పిచ్చాసుపత్రి ఉంది, చిన వాల్తేర్ లో .. అందు వల్లనేమో , వీధుల్లో పిచ్చి వాళ్ళు తిరుగుతూ కనిపించేవారు. 

చైనా యుద్ధం గట్టేక్కేం అనుకుంటే ,వెంటనే మనకి మన పక్క దేశం పాకిస్తాన్ తో యుద్ధం వచ్చింది .. మన దక్షిణ భారత దేశం వారికి యుద్ధం ప్రభావం అంత ఉండదని , యుద్ధాలన్నీ ఉత్తర భారత దేశమే చేస్తుందని ,ఒక అపప్రధ రావడం తో, మన లో కూడా దేశ భక్తీ ఉంది అని నిరూపించు కోడానికి అన్నట్టు మన ప్రాంతం లో యువకులు చాల మంది సైనికులు గా మా పేర్లు తీసుకోండి అంటూ ముందుకు వచ్చేరు . 

లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధాని . ఆయన జై జవాన్, జై కిసాన్ అని పిలుపు నివ్వడం, ఏదో ఒక దేశ భక్తీ భావం జనాలని ప్రభావితం చేసింది ,ఆ రొజుల్లొ. మన వీర జవానులకి చలి నించి కాపాడే ఉన్ని దుస్తులు లేవని ,ఎవరో అన్నారు, అంతే ,మనకి పెద్ద చలి కాలాలు , స్వెట్టర్లు అవి లేక పోయినా, కొంత మంది అయితే అప్పటికఅప్పుడు అల్లి, మరి కొంత మంది పెట్టె లో  దాచిన పాత ఉన్ని దుస్తులు, కంబళ్ళు, దుప్పట్లు, అన్ని ఇంటి ఇంటికి వెళ్లి , ఒక పెద్ద మూట గా కట్టి, మా వీధి లోకి వచ్చిన ఒక యుద్ధ సేవ లారీ లో వేసి, అమ్మయ్య మేమూ మా వంతు సాయం చేసాం అని ఊపిరి పీల్చు కున్నారు. 

ఈ సమయం లోనే హకీకత్ అనే దేశ భక్తి ప్రధాన మయిన హిందీ సినిమా ,పూర్ణ  హాల్ లోనో, ప్రభాత్ లోనో వచ్చింది , నేను మా చిన్నాన్న తో కలిసి చూసిన మొదటి హిందీ సినిమా అనుకుంటాను . 

కళ్ళు తుడుచుకుంటూ బైటకి వచ్చి ఏడవడం గుర్తు ఉంది, హిందీ కదా అర్ధం అవలేదు కాని, ఒక డబ్బా లో ఆ ఊరి మట్టి పంపిస్తుంది, ఒక ఆవిడ .ఆ సీను భలే గుర్తు ఉండిపోయింది . 

ఈ హడావిడి లో అందరికి విపరీతమయిన భయాలు, పుకార్లు, ఇదిగో ఇక్కడ వరకు వచ్చేరు ,ఇదిగో ,మన విసాపట్నం పోర్ట్ మీద బాంబు వేసారు, చైనా యుద్ధం నించి మనం ఏమి నేర్చుకోలేదు , మనకి ఆ బ్రిటిష్ ఆంగ్ల దొరలే బెస్టు , మన నాయకులు చేతులకి గాజులు తొడుక్కున్నారా ఇలాంటి ...ఏవో పెద్ద వాళ్ళ మాటలు ,మా పిల్లల చెవిలో పడుతూ ఉండేవి . 

ఇవి కాక మొట్ట మొదటి సరిగా  స్పై అనే పదం విన్నాం పిల్లలం . ఏవో ఉత్కంట భరితం గా ఉండేది వాతావరణం . 

యుద్ధం , మనుషులని దగ్గర చేస్తుంది, ఒక భయమో ఒక ఉత్పాతమో వస్తే గాని ,జనం కలవరు కాబొలు. 

వీధి లో వారు వంతులు వేసుకుని  రాత్రులు కాపలా ఉండడం మొదలు పెట్టేరు . అప్పట్లో అసలు నేపాలి ఘోర్ఖా వారు ప్రతి రాత్రి విసిల్ వేసుకుంటూ ,కాపలా గా తిరిగే వారు, చాల కాలం చూసేను, ఈ మధ్యే ఇలా నేపాలి ఘుర్కాలు కనిపించడం మానేసారు, ఏమయారో మరి?

ఇంతకి కథ లోకి వస్తే ,ఒక రోజు మా వీధిలో, కొత్త మనిషి, ఒక పాత కోటు, తొడుక్కుని, ఒక సంచి నిండా ఏవో కాగితాలు కుక్కుకుని ,తన భాష లో తనలో తనే మాట్లాడుకుంటూ , వీధి చివర , ఒక మూల కనిపించేడు .. అంటే ఒక చిన్న పిల్లాడు ఏదో ఆడుకుంటూ , బాల్  వీధి లోకి దొర్లితే ,తీసుకుంటూ ,అతన్ని చూసి, భయపడి , ఏడుపు మొదలు పెట్టాడు, ఇంకో పిల్ల ఇది చూసింది, అమ్మో బూచాడు అనుకుని, పెద్దలు నేర్పిన భయాలు, మరో అక్క కి చెప్పింది .. 

అంతే ఆ విషయం ఎలా పొక్కి పోయిందో? ( అప్పుడు ఇలా నిముష నిముషానికి బ్రేకింగ్ న్యూస్ టి వి చానెల్స్ అవి ఏం లేవే ?!?) పిల్లలందరూ చేరి ,ఒక గుంపు అయేసరికి కొంచం ధైర్యం వచ్చి ఎవరు నువ్వు? అని అడగడం , వాడు బిత్తర చూపులు చూడడం, ఇంతలో ఎవరో , పెద్ద వాళ్ళ మాటలు శ్రద్ధ గా విన్నట్టు నటిస్తూ, వినే ఒక తుంటరి కుర్రాడు ,వీడు పాకిస్తాన్ స్పై అన్నాడు .. అంతే పిల్ల లందరూ , ఒకటే స్వరం లో స్పై ,పాకిస్తాన్ గో బాక్ అంటూ ఎక్కడ పట్టుకుంటారో ఈ మాటలు అరవడం మొదలు పెట్టారు. 

నేను ప్రత్యక్ష సాక్షి ని కాక పోయినా ఆఖరి సీను కి అక్కడే ఉన్నాను. 

ఇంతలో ఎవరో వాడి సంచి లాగి అందులో కాగితాల లో ఏవో హిందీ అక్షరాల లో రాసిఉన్నాయి వీడు పాకిస్తాన్ వాడే అని మరో సారి గట్టిగా అరిచేడు , ఎవరో మరి, ఒకళు, పెద్ద వాళ్ళు కూడా గుమి గూడేరు , ఈ సరికి , కొట్టండి కొట్టండి అనేసరికి అందరూ తలో రాయి, అదృష్టం అన్ని చిన్న రాళ్ళే అక్కడ, వాడిని కొట్టడం మొదలు పెట్టేరు . 

ఎవరో మరొకరు వచ్చి ,గుంపు లో గోవిందా కాని వారు ,ఆలోచన ,వివేకం ఉన్న వారు, ఎవరో కాని, వచ్చి ,ఉండండి, అతను ఎవరో తెలియకుండా ఇలా కొట్టకూడదు ,పోలీసు కేస్ అవుతుంది అనగానే పిల్లలని తీసుకుని పెద్ద వాళ్ళు కూడా మాయం అయిపొయారు. 

నావల్ కోస్టల్ బాటరీ దగ్గర వాడిని చూసాను అని ఒకరు, వాడు పాకిస్తాన్ నించి మన ఊరు కి వచ్చి గూఢచర్యం చేస్తున్నాడు పోర్ట్ వివరాలు సేకరించి పంపిస్తున్నాడు, వదిలేయకండి, తాడు తో కట్టేయండి ( ఇంగ్లీష్ నవల లు ఎక్కువ చదివే వాడేమో అతను ) పోలీసు ని పిలుద్దాం, అని చివరికి అందరిని ఒప్పించి అతని కాళ్ళు ,చేతులు తాడు తెచ్చి కట్టేసారు .. 

అప్పట్లో సెల్ కాదు కదా ,ఒక్క ఇంట్లో ఫోన్ కూడా లేదు, అదేమిటో కూడా తెలియదు, ఎవరికీ అయినా కబురు అందించాలంటే మనమే స్వయం గా నడిచో, బస్సు ఎక్కో ,మరి దూరం అయిన ఊరు అయితే ఒక కార్డు రాసి పడేయడం ఒక్కటే మార్గమ్. 

అంత సేపు, ఆ మనిషి ఏదో తన భాష లో అరుస్తూనే ఉన్నాడు . మరి అదేమీ భాషో, హిందీ అయినా కొంత మందికి అర్ధం అవుతుంది . 

మన తెలుగు సినిమాల లో చివరి సీను లో పోలీసులు వచ్చినట్టు , మర్నాడు ఎప్పుడో వచ్చారు పోలీసులు , తీసుకు వెళ్లి పోయారు .. 

అసలే యుద్ధ వాతావరణం , మన కర్తవ్యమ్ మనం చేసాం అని ,అందరూ సంతోషించి ,పిల్లలని కూడా మంచి పని చేసారు అని మెచ్చీసుకున్నారు .. 
తొందర పడి . 

కొన్ని రోజులకి తెలిసింది అతను , ఆ గూఢచారి ,అని మేమందరమూ రాళ్ళతో కొట్టి, బంధించిన వ్యక్తీ ఒక పిచ్చి వాడు అని, పిచ్చాసుపత్రి నించి తప్పించుకుని , ఇలా తిరుగుతూ మా అఫీసియాల్ కాలని రెండో వీధి లో పిల్లలకి ,తర్వాత ,పెద్దలకి దొరికి పోయాడు , పాపమ్. 

ఇంతకి ఆ మొదటి రాయి వేసింది ఎవరో??? 

ఏ పాపం చేయని వారే ,రాయి వేయండి అని ఎవరు అన్నారు.. క్రిస్ట్ ,బుద్ధ ,ఎవరన్నా అది గుర్తు వస్తుంది నాకు ,ఎప్పుడు   గుర్తు వచ్చినా ఈ సంఘటన . 

పిల్లలు ,పసివారిని పెద్దలు ఎలా ప్రభావితం చేస్తారో? వాళ్ళని చూస్తూ, వాళ్ళ ప్రతి రూపాలు గా తయారు అవుతారు పిల్లలు. ఇలా ఎందుకు ఉన్నారు? ఇలా తయారు అయారు ఏమిటి ? అని వాపోయే ముందు ,మనలని మనం ఒకసారి పరీక్షించి చూసుకొవాలి. 

ఇంకా గుర్రబ్బండి లో వెళ్ళే నా మొదటి బడి విశేషాలు ,తరవాత పోస్ట్ లో .. 










4 కామెంట్‌లు:

  1. ఆ సమయంలో యూనివర్సిటీ లో రైఫిల్ ట్రైన్ఇంగ్ ఇచ్చారు. దేశభక్తి చూపించినా నేను సెలెక్ట్ అవలేదు. రైఫిల్ చాలా బరువు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. Rao S Lakkaraju garu,

      అవునా , ఏమిటొ అంతా ఒక్కో టైం అంటారు ,దాని మీదే ఆధారపడి ఉంటుంది ..
      సెలెక్ట్ అయితే మీ జీవితం ఎలా మారిపోయి ఉండేదో కదా?
      నా జ్ఞాపకాలు మీకు కూడా మీ జ్ఞాపకాలు రేకెత్తించడం.. బాగుందండి .
      వసంతం.

      తొలగించండి
  2. అమ్మో ఎన్ని జ్ఞాపకాలు...ఏ పాపం చేయని వారే ,రాయి వేయండి అని జెసస్ క్రైస్ట్ అన్నారండి.

    రిప్లయితొలగించండి