"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

25 మార్చి, 2013

అఫీసియల్ కాలని కబుర్లు , మరి కొన్ని.. 1

రెండు ముఖ్యమయిన సంఘటనలు అంటే ప్రమాదాలు గురించి చెప్పాలి,ఆ రెండు దుర్ఘటనలు గుర్తు వస్తే, టైం అంటారు, దాని మీద నాకు నమ్మకం ఎక్కువవుతూ ఉంటుంది.   
మొదటిది, నా వల్లే జరిగంది, అంటే నా నిర్లక్ష్యం వలెనే, ఇంకా చెప్పాలంటే నా పుస్తకాల పిచ్చి వల్ల.. 
ఆ రాత్రి, మా అమ్మ అక్కడే ,మా ఇంట్లో ఉన్నారు, ఆఖరి చెల్లెలు , చిన్నది, నెలల పిల్ల , లేదా ఏడాది ఉంటుందేమో ? అందరూ భోజనాలు చేయడానికి వంటిట్లో కి వెళ్లి, చెల్లి ని చూస్తూ ఉండు అని చెప్పి భోజనాలు చేయాడానికి వెళ్లారు . 
నేను పుస్తకం చేతికి దొరికింది ఒకటి పట్టుకుని , అది చదువుతూ తన్మయత్వం లో పరిసరాలు మర్చి పొయాను. మా చెల్లి ,పాక్కుంటూ వెళ్లి, మంచం కిందకి దూరింది, మర్చి పోయాను ,చెప్పానో లేదో , అప్పుడు మంచాలు అంటే పట్టే మంచాలే , వాటి ని గట్టిగా పట్టి లు లాగి, సరి చేయడం ఒక పని, నేను కూడా నా చెయ్యి పట్టి కింద పడి నలగ కుండా , పట్టాలు లాగి టైట్ చేసే పని లో నా వంతు సాయం  చేసే దాన్ని. మా మామ్మ గారు చేసే వారు ఈ పని ,చిన్న పిల్లల  ఉత్సాహం లో నేను సాయం  చేసే దాన్ని, మిగిలిన వారు తప్పించుకునే వారు, మరి. 
అయినా ఆ మంచాలు కూడా పెద్ద వారికే, మిగిలిన పిల్లలం, అందరం, నేల మీద పరుపులు పరుచుకుని వరసగా ,పడుకోవడమే . 
ఇంతకీ ,అసలు కథ కి వస్తే , మా చెల్లి అలా పాక్కుంటూ ,వెళ్లి ఎక్కడో మూల పడి ఉన్న ఒక నూనె సీసా మూత, అంటే రేకు మూతలుంటాయి కదా ,అది ఏదో ఆట వస్తువు అనుకుని, చక్కగా నోట్లో పెట్టుకుంది . 
మన పెద్ద వాళ్లకి కనిపించని, ఇలాంటి మూతలు, చిన్న చిన్న చింత పిక్కలు, ఏవో పనికిరానివాన్ని ,ఇష్టం గా నోట్లో పెట్టుకుని చప్పరించడం పిల్లల హక్కు. 
పెద్దలకి ,పిల్లలకి అదే తేడా మరి.  విచక్షణ , ఆ జ్ఞానం ఇంకా రాని పెద్ద వాళ్ళు మనకి తారస పడుతూ ఉంటారు లెండి, అది వేరే విషయం . 
మూత  నోట్లో పెట్టుకున్న మా చెల్లెలు , ఈ లోపల ఊపిరి ఆడక, నీలం గా మారిపోయింది .. ఆ గురక లాంటి చప్పుడు కి తెలివి వచ్చి నేను , మంచం కింద నించి మా చెల్లి ని లాగి, తన పరిస్థితి చూసి , బెంబేలెత్తి అమ్మా ,అత్తా అంటూ ఒక్క గావు కేక పెట్టి , అందరిని పిలిచాను. 
అన్నం తింటున్న చేతి తో మా అమ్మ వాళ్ళు వచ్చి, నా వీపు మీద ఒకటేసేరేమో కూడా, చూస్తూ ఉండమంటే ఇలాగా ? అని. 
మా ఎదురింట్లో ఉన్న స్కిన్ స్పెషలిస్ట్  డాక్టర్ గారి దగ్గరకి పరుగెత్తేరు. ఆయన నేను ఇక్కడ ఏమి చేయలేను, అలా తల కిందులు గా పట్టుకుని కే జి హెచ్ ఎమెర్జెన్సి  కి తీసుకువెళ్ళండి , అని హడావిడి పెట్టేరు . 
అప్పటికే నీలం గా మారి పోతోంది తను. 
ప్రతాప్ అని మా ఇంకో మామ్మ ఇంట్లో చదువు కోడానికి వచ్చిన ఒక బంధువు  చాల పొడవుగా, బలం గా ఉండే వారు, అతను వచ్చి దేవుడి లా అంటుంది అమ్మ .. అలా లుంగీ మీదే , పిల్లని తల కిందుల గా పట్టుకుని, ఆ మూత మింగకుండా  జాగ్రత్తగా , అది సరిగ్గా విండ్ ఫైప్ కి అడ్డం పడింది మరి, అప్పుడు ఏ బండి లు లేవు, అలాగే నడుచుకుంటూ కే జి హెచ్ కి పరుగు పెట్టారు . 
సమయానికి ఈ ఎన్ టి సర్జన్ సినిమా కి వెళ్ళారు ట , ఎంత టెన్షన్ చూడండి, మరి అప్పుడు ఇలా నిముష నిముషాని మోగే సెల్ ఫొన్స్ లేవు . మొత్తానికి అతనికి కబురు అందింది, ఎలాగో , టైం .. అంటే ఇదేనేమో .. 
వచ్చి రావడం తోనే గొంతు కి అడ్డం పడ్డ ఆ మూత తీయడానికి ,పాప నోరు ని తెరిపించి, ఆ మూత ఎలా తీసారో ఎంత కష్ట పడ్డారో , డాక్టరు గారికి ఎన్ని వందనాలు పెట్టాలో! మా అమ్మ కూడా మూడ్రోజులు హాస్పిటల్ లో ఉండిపోయింది .  గొంతు వాచిపోయిన మా చెల్లెలు కి నెల రోజులు పట్టి నట్టుంది మళ్లీ మామూలు గొంతు రావడానికి. ఆ వాపు, పుండు తగ్గి  మళ్లీ మామూలుగా పాలు అవి తాగడానికి . ఆ వీధి వీధి అంతా ఎంత బాధ పడ్డారో, ఆ రోజు.  తిరిగి వచ్చిన మా చెల్లి మూత పాప అని పేరు తెచ్చుకుంది 
ఇప్పుడు మేమంతా గర్వ పడే పెద్ద సైంటిస్ట్ . .. ఆ మూత పాప. 
సంగీతం మా ఇంటా వంటా లేదు కాబట్టి సరిపోయింది, లేక పోతే గొంతు మటుకు ,చాలా కాలం వరకు బొంగురు గా ఉండేది మా చెల్లి కి ... 
ఇంకా రెండో సంఘటన, కూడా ఏక్సిడెంట్ .. ఈసారి మా నాన్నగారికి , మా రెండో చెల్లి కి. 
ఇద్దరూ చిట్టివలస నిండి వచ్చేరు, బస్సు స్టాండ్ నించి  రిక్షా ఎక్కి ,మా వీధి లోకి వచ్చేరు. చెప్పేను కదా మా వీధి ,చాల అప్ , మా ఇల్లు డౌన్ లో ఉండేది రిక్షా కి బ్రేక్ లు పని చేయలేదు కాబోలు, మా ఇల్లు ఇక్కడే ఆపు ,అంటున్నా అతను ఆపలేక పోయాడు ట . స్పీడ్ గా వెళ్లి, ఆ వీధి చివర మలుపులో బోల్తా కొట్టి ఆగిపోయింది . మా చెల్లి ,ఎర్రగా జుట్టు కూడా ఎర్ర జుట్టే, బొమ్మలా  ఉండేది , తను మటుకు ఎగిరి పక్కన పొడి పొడి గా ఉన్న ఒక లోతు  లేని కాలవ లో పడిపోయింది . 
తనకేమి అవలేదు, ఒకట్రెండు చోట్ల గీరుకు పోవడం తప్ప. మా నాన్న గారికి మటుకు కాలికి ఫ్రాక్చర్  అయింది . చాలా పెద్ద దే , కాలి ఎముక విరిగి పోయింది . వెంటనే కే జి హెచ్ కి తీసుకు వెళ్లేరు , ఆ వెళ్ళడం ,వెళ్ళడం, ఆరు నెలలు ,అవును ఆరు నెలలు ఆసుపత్రి లో ఉండిపోయారు ,ఆర్తో పెడిక్ వార్డు అందులో ,మగ వారికి వేరే వార్దు. మా చిన్నాన్నలే పడుకునేవారు, సాయం గా. కే జి హెచ్ లో ఇచ్చే రొట్టె ,పాలు , మా అందరికి గుర్తే ,పిల్లలకి సరదా ఆ రొట్టె తినడం ,పెద్ద వారికి వికారం ,నచ్చేది కాదు. మరి ఇప్పుడు ఇస్తున్నారో ? లేదో ? మంచి డాక్టర్లు ఉండే వారు, ఇలా ప్రైవేట్ గా చూడడం అది ఉన్నట్టు లేదు , అప్పట్లో . మంచి మందులు లేవో ఏమో మరి, చాల కాలం పట్టింది, విరిగిన ఎముక అతుక్కోడానికి .  మూడు నెలలు ఏమో సెలవు మీద జీతం ఇస్తారు, మిగిలిన నెలలు మరి జీతం లేని సెలవే . 
మొత్తం ఒక ఏడాది పట్టింది, కాలు నయం అయి, మా నాన్నగారి తిరిగి జూట్ మిల్ లో ఉద్యోగానికి వెళ్ళడానికి . అయితే అప్పుడు ఉమ్మడి  కుటుంబ వ్యవస్థ ఒకరికి ఒకరు సాయం గా, పెద్ద గా ఆస్తులు అవి లేకపోయినా మన ఇంట్లో వారికి మనమే ఆస్తి అన్నట్టు ఉండేవి ఆ ప్రేమానుబంధాలు . 
మా అమ్మ చాల కష్టాలు పడింది కాని, ఎప్పుడూ ఎవరిని ఏమి నిందించడం , ఎవరిని పల్లెత్తు మాట అనడం చూసిన గుర్తు లేదు . ఉన్న దాంట్లోనే హాయిగా ఎలా గడిపామో ? అప్పుడు . 
వసతులు లేని ఇళ్ళు , చిన్న చిన్న ఇళ్ళు , అర కొర వనరులు , కాని కొండంత ప్రేమ ని పంచే కుటుంబ సభ్యులు.. అదే మరి మన పాత తరం. 
ఇలాంటి పునాదుల మీద గడిచింది మా బాల్యం , నా ఉద్దేశం అందరి కి ఇంచుమించు ఇలాంటి జ్ఞాపకాలే ఉంటాయి . . మీకూ ఉండే ఉంటాయి కదా.. 




























కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి