"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

21 మార్చి, 2013

అఫీసియల్ కాలని -- .నా చదువు

అఫీసియల్ కాలని రెండో వీధిలో మరో పేజి ..నా చదువు . 

నాన్న గారికి చిట్టివలస లో ఉద్యోగం , అది మరి పల్లెటూరు , ఇక్కడ చదువు బాగుంటుంది అని, మా తాత గారింట్లో , పెట్టి చదివించాలని ,నిర్ణయం అయింది. అత్త, చిన్నాన్నలు ఇద్దరు , మామ్మ ,తాత గారు .. మా ఇంట్లో సభ్యులమ్. ఉదయం పొయ్యి మీద వంట, కాఫీ లకి, సాయంత్రం బొగ్గు కుంపటి, అది కాగితాలు కింద పెట్టి నిప్పు అంటించాలి, ఆ నిప్పు కి బొగ్గు అంటుకుని , కణ కణ లాడి ,వేడి ఎక్కేసరికి ... ఒక్క రోజు గ్యాస్ లేకపోతే మనం వేసే చిందులు తలచుకుంటే , ఎలా వండే వారో ,ఇంతమందికి . 
వీరు కాక ,ఆసుపత్రి పని మీద వచ్చి ,నెల నెలలు ఉండి పోయే చుట్టాలు ,పక్కాలు. వంటింట్లో ఒక అటక ఉండేది, అక్కడ మూతికి వాసన చుట్టి , పెద్ద పెద్ద జాడీలు ఉండేవి, అందులో మా తూర్పు వాళ్ళ స్పెషల్ ,ఎండావకాయ , మాగాయ మొదలైనవి , విడిగా, మడి గా పెట్టి ఉండేవి . 

దగ్గరలో వసంత బాల విహార్ అని ఒక బడి ఉంది, సాయంత్రం అదే ఆవరణ లో ప్రతి రోజు పురాణ కాలక్షేపం అయేది.  అయితే అప్పుడే కొత్తగా రామకృష్ణ మిషన్ వారు ,శారదా బాల విహార్ అని ఒక స్కూలు ,అది అంతా ఆంగ్ల మాధ్యమం అని, ఇదయితే మన వసంత కి బాగుంటుంది అని నిర్ణయించి , మా చిన్నన్న నిచ్చి నన్ను పంపించేరు . 

అప్పటికే ఆరేళ్ళు వచ్చి, తెలుగు అక్షరాలన్నీ ఆంధ్ర పత్రిక లో గుర్తు పెట్టి, కూలిన గోడలు , అవి చదవడం మొదలు పెట్టి ఉన్నాను. 

అయితే నా పేరు, చాట భారతం లాగ ఏదో ,బారసాల నాడు సరదాగా బియ్యం లో రాసిన చాంతాడంత పేరు , రాసేశారు  , మా చిన్నాన్న. ఆ పేరే ఉండి పోయింది , ఇలా విదేశి ప్రయాణాలు చేస్తానని, ఇమిగ్రెశను వారిచ్చే పేపర్ లో  ఉన్న గళ్ళు కి నా పేరు సరిపోదు అని అప్పుడు ఊహించలేదు మరి మా చిన్నాన్న. 

శారదా బాల విహార మొదట్లో కలెక్టర్ ఆఫీసు ఆవరణ లో  టెమ్పరరి గా నాలుగు గదులు వేసి మొదలు పెట్టేరు. 

స్వామిజి అనే వారం అందరం ,కాషాయం దుస్తులలో ,ఎప్పుడూ నవ్వుతూ , పసి పిల్లాడి నవ్వులా ఉండేది .. ఆయన భోలా నవ్వు, ఆయనే సూత్రధారి ,ఆ విద్యాలయం ఆయన కన్నకలల కి రూపం . 

కమల టీచేర్ మా హెచెమ్  .ఆవిడ ఎదురు పడితే అందరికి కాళ్ళ లలో వణుకు . అప్పుడు తెలియదు కాని, ఐ సి ఎస్ అంటే అప్పుడు కేంబ్రిజ్ సిలబస్ చెప్పేవారు మాకు. మొదటి తరగతి కే పెద్ద కట్ట పుస్తకాలు చూసి, హడలి పోయారు ,మా ఇంట్లో వాళ్ళు . 

నేను చిన్న పిల్లని ,ఇవన్ని చదవ లేనని, వాళ్ళ గట్టి నమ్మకం , కాని నాకయితే ఎప్పుడెపుడు చదివేస్తానా ?? అని ఊరికే తాపత్రయం. 

పెద్ద దూరం కాదు కాని, అప్  డౌన్స్ వల్ల దూరం అనిపించేది, అందులో చిన్న పిల్లని. 

మా వీధిలో, ఇంకా కృష్ణ నగర్ లో ఉన్న కొంత మంది పిల్ల లకి కలిపి ,ఒక గుర్రం బండి మాట్లాడేరు . అది పెట్టె బండి, అంటే రెండు చిన్న మెట్లు ఉంటాయి, అవి ఎక్కి, లోపల ఒక పెట్టె లా ఉంటుంది, అటు ఇటు రెండు చెక్క బెంచీలు. మనం ఎక్కి తలుపు మూసేయాలి . అటు .ఇటు ,రెండు చిన్న కిటికీ లు కూడా ఉండేవి, గాలి రావడానికి. మా పిల్లలకి ఎంత సరదా వో . . 

కృష్ణ నగర్ వీధిలో తిరుగుతున్నప్పుడు ,ఓ వీధి మూల ఇంట్లో , కాగితం పూల చెట్టుఉండేది ..  అది చేతిలో పట్టుకుని ,నాలుగు పూలు కోయడం, అలా చేతులు గీరుకు పోవడం , కాగితం పూలకి ముళ్ళు ఉంటాయి అని బాగా తెల్సింది .. అప్పుడే . 

మరు ఏడాది ,కొత్తగా కట్టిన తన సొంత భవనం లోకి మారి పోయింది మా స్కూల్ .. పక్కనే వివేకానంద హాల్ కట్టేరు, అందులో అసెంబ్లీ , సాయంత్రాలు ఏవయినా కార్యక్రమాలు జరిగేవి . 

ఒక సారి ఇప్పుడు లా సన్స్ బే కాలని లో ఉన్న శాంతి ఆశ్రమం కి పిక్ నిక్ కి తీసుకు వెళ్ళేరు, 10 నంబరు బస్సు ఎక్కి , యూనివర్సిటీ దగ్గర, అదే లాస్ట్ స్టాప్, అక్కడ నిండి 2 నంబరు బస్సు ఎక్కి, చిన వాల్తేరు లో దిగి, అక్కడ నించి, అంతా చిట్టడివి లా పిచ్చి మొక్కలు, గడ్డి, మధ్యలో చిన్న కాలి దారి, అందరూ భయ పడుతూ ఉంటె, నెమ్మదిగా, అర్భకం గా ఉండే నేను ,ముందు దారి తీశాను, అక్కడ సరుగుడు చెట్ల మధ్య నించి నీలి ఆకాశం దిగి వచ్చినట్టు ,సముద్రం చూసి, మొదటి సారి, మా బీచ్ కాకుండా, ఆ ..ఇక్కడ కూడా ఉంటుందా ? సముద్రం, మన ఊరు చుట్టూ ఉంటుందా ఏమిటి? అని చాల సంతోషించి , సముద్రం ఇంత విశాలమయినదా ? అని తెగ గెంతిన గుర్తు. 

చెట్లు మధ్య చాల ఆటలు ఆడుకుని, మా క్యారేజ్ లో అన్నాలు తినేసి, సాయంత్రం ఇంటికి బయలుదేరాం . 

ఆ ఆటల్లో, నా కాలికి తుమ్మ ముల్లు  గుచ్చుకుంది . చాల బాధ, ఎర్రగా కందిపోయి ఎంత బాధ పెట్టిందో? 

నా స్టీల్   క్యారేజు పోయింది ,  అంతే  సంతోషం ఆవిరి అయిపొయింది, ఇబ్బందులు తెలియకుండా పెంచినా, అది ఖరీదయినది అని, అది పోతే ఇంట్లో చాల తిడతారు అని ,ముందే ఏడవడం మొదలు పెట్టేను . 

అదేమిటో ,నా మీద ఎంత నమ్మకం ,ప్రేమో మా వాళ్లకి, పిల్లలని ,వాళ్ళ క్యారేజ్ లను సరిగ్గా చూసుకోరా ? అంటూ టీచర్లనే తిట్టేరు, మా ఇంట్లో  వాళ్ళందరూ .. 

నేను ఏ ముహూర్తం లో పుట్టానో కానీ, అన్ని వేపులా ప్రేమ , లాలన , అదృష్ట జాతకురాలిని అని చెప్పుకొవచ్చు. 

మా అమ్ముమ్మ కి అక్క అయిన ఇంకో అమ్ముమ్మ నాకు రెండు గిన్నెల స్టీలు క్యారేజు , కొని ఇచ్చింది, నేను బాగా చదువుకుంటున్నాను అని.. 

ఇప్పటికి ఆ క్యారేజు , మా అమ్మ దగ్గర ఉంది . పెద్ద వాళ్ళ ఆశీస్సులు నా పై ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ.. 

గుర్రబండి యోగం ఒకట్రెండు ఏళ్ళ తో ముగిసింది . 
స్కూల్ దగ్గర అయింది, అంటే నేను పెద్ద దాని అయాను అన్నమాట . 
కలెక్టర్ ఆఫీసు కూడలి లో ఒక రోజు మా ఇంటి దగ్గరే ఉండే మా స్నేహితుల కుటుంబం లో ధన లక్ష్మి , ఆవిడ అప్పటికే కాలేజ్, కనపడే సరికి , ఉత్సాహం పట్ట లేక ధన లక్ష్మి అక్కా అంటూ ఒక గావు కేక పెట్టాను, ఇంటికి రాగానే నాకు క్లాసు పీకేసారు. 

ఎంత బాగా గుర్తుండి పోయింది, ఆడవారి ని పేరు పెట్టి, గట్టిగా,అందులో రోడ్డు మీద పిలవ కూడదు అని. కొన్ని పాఠాలు ఎందుకో అలా గుర్తుండి పొతాయి. 


మూడో తరగతి లో అనుకుంటా ,నోరు ఎత్తకుండా ,బుద్దిగా , చక్కగా , మంచి అమ్మాయి గా ఉన్నందుకు నాకు ఒక బెస్ట్ స్టూడెంట్ ప్రైజ్ ఇచ్చేరు , ఎంత బోరింగ్ కదా మంచి స్టూడెంట్ లైఫ్ .. 

ఎప్పుడయినా ఇలాంటి బుద్దిమంతుల పిల్లలు చెడి పోతారా ? అంటే సమాజం దృష్టి లో, అంటే రెబెల్ అయిపోతారా  అంటే .. సమాధానం . అవును. 

మా అమ్మకి నిద్ర పట్టని రాత్రుళ్ళు ,అది నా వల్లే అంటే నమ్ముతారా ? 
నమ్మండి . మరి ...చెపుతాను ,అన్ని చెపుతాను .. చెప్పాలనే నా తాపత్రయం అంతా .. మరో పోస్ట్ ,మరో కథ.  





4 కామెంట్‌లు:

  1. అది పోతే ఇంట్లో చాల తిడతారు అని ,ముందే ఏడవడం మొదలు పెట్టేను .
    --------------------------------------------------------
    నేనే అను కున్నాను. అందరూ ఇల్లాగే చేస్తారా !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. Rao S Lakkaraju garu,

      డెఫెన్స్ లో ఎదుర్కోవడం అంటే ఇదే మరి.
      మీరు కూడా? అని నేను ఇప్పుడు స్వాంతన పొందవచ్చు
      హా హా ...ఇది యూనివెర్సల్ గా పని చేసె మెకానిసం అనుకుంటానండీ .
      వసంతం.

      తొలగించండి
  2. బాగుందండీ మీ అఫీసియల్ కాలని ముచ్చట్లు....నిజం కదా బాల్యం ఎంత అందంగా ఉంటుందో...బాల్యం మళ్ళీ తిరిగి వస్తే ఎంత బాగుండు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అవును బాల్యం తిరిగి రాదు కాబట్టే అందమయినది, తిరిగి వస్తే మన అనుభవంతో ఎంత చండాలం చేయ గలమో మనం మన పిల్లల్ని పెంచే సమయం లో తెలుస్తుంది కదా. నిబంధనలు, పెత్తనాలు, పసి వారి మీద, మనమేనా ఒకప్పుడు బాల్యం అనుభవించిన వారం అనే స్పృహే లేకుండా.. అందుకే ఒక్కటే బాల్యం మనకి..
      ఓపికగా చదివి నీ కామెంట్స్ కూడా రాసేరు .. థాంక్ యూ డేవిడ్ .
      వసంతం.

      తొలగించండి